-ఇంజినీర్లకు శుభవార్త -పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడి -గ్రామీణ తాగునీటిశాఖలో 529 ఇంజినీరింగ్ పోస్టులు.. భర్తీకి ఉత్తర్వులు జారీ -ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 709 మంది నియామకం హైదరాబాద్, డిసెంబర్ 27 (టీ మీడియా): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జలహారం (వాటర్ గ్రిడ్) కోసం కొత్తగా 1,238 ఇంజినీరింగ్ ఉద్యోగాలను భర్తీచేస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. గ్రామీణశాఖను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే గ్రామీణ తాగునీటిశాఖలో 529 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. జలహారం పనులపై మంత్రి కేటీఆర్ శనివారం మీడియాతో మాట్లాడారు. 2018నాటికి రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకొన్న తమ ప్రభుత్వం.. జలహారం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ...